భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 773 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ కాగా 32 మంది మరణించారు. దేశవ్యాప్తంగా నేటి వరకు 5,194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు.
'ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 402 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 బారినపడి 149 మంది చనిపోయారు. రాష్ట్రాలకు వైద్య పరికరాలు అందిస్తున్నాం. కరోనా హాట్‌స్పాట్లలో పర్యవేక్షణకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. అందరూ తప్పకుండా సామాజిక దూరం పాటించాలి. దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల కొరత ఇప్పుడు గానీ భవిష్యత్తులోనూ ఉండదు. దేశంలో మాత్రల నిల్వలు సరిపడా ఉన్నాయని' లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.