కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తప్పవని, ప్రజలు మరిన్ని స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకొని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుందామని బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చినవారిలోనే కరోనా వైరస్ బయటపడుతున్నందువల్ల ఇతరదేశాల నుంచి వచ్చినవారిని ఎవరినైనా తప్పనిసరిగా సంపూర్ణ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఇండ్లకు పంపాలని అధికారులను ఆదేశించారు.
ఈ విషయంలో ప్రజలు కూడా అప్రమత్తమై ప్రభుత్వానికి సమాచారమందించాలన్నారు. ప్రజలు ఎక్కువగా గుమిగూడే కార్యక్రమాలన్నింటినీ రద్దుచేసుకోవాలని సూచించారు. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు కూడా ప్రజలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీసుకొనే చర్యలను ప్రజలు అర్థం చేసుకొని రాష్ర్టాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలపై సీఎం కేసీఆర్ గురువారం అత్యున్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తిస్థాయిలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై విస్తృతంగా చర్చించనున్నారు.